నేను బీజేపీలో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు: టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్

17-06-2021 Thu 21:19
  • టీఆర్ఎస్ ను వీడేదిలేదన్న జహీరాబాద్ ఎంపీ
  • చివరి వరకు గులాబీ పార్టీతోనే అని ఉద్ఘాటన
  • యూట్యూబ్ చానళ్లలో తప్పుడు వార్తలు అంటూ ఆగ్రహం
  • పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
TRS MP BB Patil clarifies on rumors

టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ (జహీరాబాద్ లోక్ సభ స్థానం) త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై బీబీ పాటిల్ స్వయంగా స్పందించారు. తాను టీఆర్ఎస్ ను వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని సోషల్ మీడియా వేదికలు, యూట్యూబ్ చానళ్లు తమ పబ్బం గడుపుకోవడానికి అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఆ వార్తల్లో నిజంలేదని తెలిపారు.

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటానని బీబీ పాటిల్ హెచ్చరించారు. త్వరలోనే పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. తాను చివరి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఉద్ఘాటించారు. తాను ప్రజలతో మమేకమై చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక కొందరు ఇలాంటి చిల్లరవేషాలు వేస్తున్నారని పాటిల్ విమర్శించారు.