కశ్మీర్ సరిహద్దుల్లో జవాన్లతో ఉల్లాసంగా గడిపిన హీరో అక్షయ్ కుమార్

17-06-2021 Thu 18:35
  • తులైల్ క్యాంపును సందర్శించిన అక్షయ్
  • బీఎస్ఎఫ్ జవాన్లతో ఆటాపాట
  • ముగ్ధుడ్నయ్యానన్న అక్షయ్
  • జవాన్లే రియల్ హీరోలని కితాబు
Hero Akshay Kumar visits BSF Jawans camp at borders

సామాజిక బాధ్యతతో వ్యవహరించే హీరోల్లో అక్షయ్ కుమార్ ముందువరుసలో ఉంటాడు. తాజాగా అక్షయ్ కుమార్ జమ్మూ కశ్మీర్ లోని తులైల్ క్యాంపును సందర్శించారు. అక్కడ సరిహద్దు భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లతో ఉల్లాసంగా గడిపారు. వారితో కలిసి డ్యాన్సులు చేసిన అక్షయ్ కుమార్, సరదాగా వాలీబాల్ కూడా ఆడారు. అంతేకాదు, ఓ జవాన్ తో ఆర్మ్ రెజ్లింగ్ కూడా చేశారు. తన పర్యటనపై అక్షయ్ కుమార్ ట్విట్టర్ లో స్పందించారు.

సరిహద్దులను రక్షిస్తున్న ధైర్యశాలులను కలిశానని, తన పర్యటన గుర్తుంచుకోదగ్గ విధంగా సాగిందని వెల్లడించారు. దేశ సరిహద్దులకు రావడం ఎల్లప్పుడూ ముగ్ధుడ్ని చేస్తుందని, నిజమైన హీరోలను కలవడం సంతోషాన్నిస్తుందని తెలిపారు. తన హృదయం పూర్తిగా జవాన్ల పట్ల గౌరవంతో నిండిపోయిందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.