కొత్త ప్రాజెక్టులో వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఛాన్స్!

17-06-2021 Thu 17:37
  • తమిళనాట విపరీతమైన క్రేజ్
  • లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్
  • బాలకృష్ణ సినిమాలోను అవకాశం
Varalakshmi Sharath Kumar in Hanuman movie

తమిళనాట వరలక్ష్మి శరత్ కుమార్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే ముందుగా ఆమెను కలవాల్సిందే. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి అక్కడ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరహా పాత్రలకి గాను అక్కడ ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. అలా తమిళంలో ఆమె ఫుల్ బిజీగా ఉంది. అయినా తెలుగు నుంచి పవర్ఫుల్ రోల్స్ వెళితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' .. 'నాంది' సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక 'క్రాక్' సినిమాలో విలన్ గా ఆమె ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించనున్న సినిమా కోసం కూడా ఆమెను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే 'హనుమాన్' సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, హీరోగా తేజ సజ్జ నటించనున్న సంగతి తెలిసిందే.