Yediyurappa: సీఎంగా కొనసాగే అర్హత యడియూరప్పకు లేదు: బీజేపీ నేత విశ్వనాథ్ తీవ్ర ఆరోపణలు

Yediyurappa has no couraget to continue as CM says H Vishwanath
  • ప్రభుత్వ వ్యవహారాల్లో యడ్డీ కుటుంబ జోక్యం ఎక్కువైంది
  • అన్ని విభాగాల్లో యడ్డీ కుమారుడు కలగజేసుకుంటున్నారు
  • యడ్డీ ప్రభుత్వంపై మంత్రులందరూ అసంతృప్తిగా ఉన్నారు
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. తాజగా మరో నేత హెచ్.విశ్వనాథ్ యడ్డీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత, సత్తా యడియూరప్పకు లేవని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని కర్ణాటక బీజేపీ ఇన్చార్జి అరుణ్ సింగ్ కు తెలిపారు. కర్ణాటక బీజేపీలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో అరుణ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఈ సమావేశంలో యడ్డీపై విశ్వనాథ్ ఎన్నో ఆరోపణలు చేశారు. యడ్డీ ప్రభుత్వంపై మంత్రులందరూ అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. యడియూరప్ప నాయకత్వంపై తమకు గౌరవం ఉందని... అయితే, ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపే సత్తా మాత్రం ఆయనలో కొరవడిందని చెప్పారు. వంశపారంపర్య రాజకీయాలు ప్రమాదకరమని ప్రధాని మోదీ పదేపదే చెపుతుంటారని... అయితే కర్ణాటకలో ఇప్పుడు అదే రాజకీయం నడుస్తోందని ఆయన అన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తాను వెల్లడిస్తే... ప్రభుత్వం తన వ్యాఖ్యలను మరో విధంగా తీసుకుంటోందని విమర్శించారు.

కర్ణాటక ప్రభుత్వ వ్యవహారాల్లో యడియూరప్ప కుటుంబ జోక్యం ఎక్కువైపోయిందని విశ్వనాథ్ మండిపడ్డారు. ప్రతి డిపార్ట్ మెంట్ లో యడియూరప్ప కుమారుడు కలగజేసుకుంటున్నారని దుయ్యబట్టారు. విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Yediyurappa
Karnataka
H Vishwanath

More Telugu News