Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు కేసు.. జిల్లా జైలు అధికారులకు మెమో జారీ చేసిన సీఐడీ కోర్టు!

  • రఘురాజు వద్ద పూచీకత్తు తీసుకోలేకపోయిన జైలు అధికారులు
  • కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోయారంటూ కోర్టు అసహనం
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో పూచీకత్తు ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్న
CID court issues memo to jail officers in Raghu Rama Krishna Raju case

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు విషయంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. రఘురాజు నుంచి సొంత పూచీకత్తును తీసుకునే విషయంలో... గుంటూరు జిల్లా జైలు అధికారులకు సీఐడీ కోర్టు జడ్జి అరుణ మెమో జారీ చేసినట్టు సమాచారం. రాజద్రోహం కేసులో రఘురాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత రఘురాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పు మేరకు ఆయనకు సికింద్రాబాదులోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్ప అందించారు. ఆయనకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే, ఆసుపత్రి నుంచి విడుదలైన 10 రోజుల్లోగా లక్ష రూపాయల సొంత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అదే మొత్తంలో జామీను ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.

ఆ తర్వాత రెండు రోజులకు ఆయన తరపున ఇద్దరు వ్యక్తులు జామీను ఇచ్చారు. ఆ జామీను పత్రాలను సీఐడీ కోర్టు ఆమోదించింది. రఘురాజు పూచీకత్తును కూడా తీసుకోవాలని జిల్లా జైలు అధికారులను సీఐడీ కోర్టు ఆదేశించింది. అయితే, రఘురాజు పత్రాలను ఆర్మీ ఆసుపత్రికి జైలు అధికారులు పంపించగా... ఎంపీ తమ వద్ద లేరని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని ఆసుపత్రి వర్గాలు బదులిచ్చాయి. ఇదే విషయాన్ని జైలు అధికారులు సీఐడీ కోర్టులో దాఖలు చేశారు.

దీంతో, జైలు అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలుపరచలేకపోయారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఎంపీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో పూచీకత్తు ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితం జైలు అధికారులకు జడ్జి అరుణ మెమో జారీ చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News