CBSE: జులై 31లోగా ప్లస్​ 2 ఫలితాలు: సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఎస్​ఈ

  • మూడేళ్ల ప్రతిభ ఆధారంగా మార్కులు   
  • అర్హత లేకుంటే ‘కంపార్ట్ మెంట్’ కేటగిరీలోకి
  • మార్కుల కోసం మోడరేషన్ కమిటీ ఏర్పాటు
CBSE Announces Class 12 Scoring Plan Results By July 31

12వ తరగతి (ప్లస్ 2) ఫలితాలను జులై 31లోగా వెల్లడిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పదో తరగతి, పదకొండో తరగతి, ప్రి బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తామని చెప్పింది. కరోనా సంక్షోభంతో ప్లస్ 2 పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పదో తరగతి నుంచి గత మూడేళ్లలో బోర్డు పరీక్షల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా మార్కులను కేటాయిస్తామని పేర్కొంది.

విద్యార్థుల ప్రతిభ మెరుగుపడేలా పాఠశాలలు మార్కులిచ్చేందుకుగానూ మోడరేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ తెలిపారు. ప్రతి స్కూల్ లో ఈ కమిటీకి సంబంధించి ఆయా స్కూల్ కు చెందిన ఇద్దరు సీనియర్ టీచర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే మూడో వ్యక్తినీ నియమిస్తామన్నారు.

కాగా, ప్లస్ 2 ప్రి బోర్డ్ ఎగ్జామ్స్ ను బట్టి 40 శాతం మార్కులు, పదకొండో తరగతి వార్షిక పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా 30 శాతం మార్కులు, పదో తరగతి ప్రతిభ ఆధారంగా మరో 30 శాతం మార్కులను ఇస్తామని జస్టిస్ ఎ.ఎం. ఖన్వీల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనానికి సీబీఎస్ఈ ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల కమిటీ తెలిపింది. స్కూళ్లు అందించిన వివరాలను బట్టి ప్రాక్టికల్ మార్కులను వేస్తామంది.

ఆ మూడేళ్ల కాలానికిగానూ ఓ విద్యార్థికి అర్హతలు లేకుంటే ‘కంపార్ట్ మెంట్’ లేదా ‘ఎసెన్షియల్ రిపీట్’ కేటగిరీలో చేరుస్తామని చెప్పింది. ఒకవేళ సీబీఎస్ఈ ఇచ్చే మార్కులతో విద్యార్థులు సంతృప్తి చెందలేకపోతే.. పరీక్షలు నిర్వహించినప్పుడు (ఎప్పుడు పెడితే అప్పుడు) ఆయా విద్యార్థులు హాజరు కావొచ్చని స్పష్టం చేసింది.

అయితే, ఫలితాల్లో వివాదాల పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సీబీఎస్ఈ, కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్ 21కి విచారణను వాయిదా వేసింది.

More Telugu News