HCA: అవినీతిని అడ్డుకుంటున్నాననే నోటీసులు: అజారుద్దీన్​

  • అపెక్స్ కౌన్సిల్ లో ఐదుగురు ఓ వర్గమన్న హెచ్ సీఏ అధ్యక్షుడు
  • రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని కామెంట్
  • ఇవ్వాళ్టి నుంచి అజర్ అధ్యక్షుడు కాదని తేల్చి చెప్పిన కౌన్సిల్
  • ఇందులో బీసీసీఐ జోక్యం ఉండబోదని వెల్లడి
Deliberately Issued HCA President Azahar on Notices He Received

తనకు ఇచ్చిన నోటీసులపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్ స్పందించారు. అపెక్స్ కౌన్సిల్ లో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారని ఆరోపించారు. వారి అవినీతిని అడ్డుకుంటున్నాననే తనకు ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తానెప్పుడూ హెచ్ సీఏ గౌరవాన్ని తక్కువ చేయలేదన్నారు.

అపెక్స్ కౌన్సిల్ లో సభ్యులైన జాన్ మనోజ్, విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధలపై అవినీతి ఆరోపణలున్నాయని అజర్ అన్నారు. హెచ్ సీఏలో అవినీతిని అరికట్టేందుకు సమర్ధులైన వ్యక్తిని అంబుడ్స్ మన్ గా నియమించాలని కోరితే.. వారే తప్పుబట్టారన్నారు. వారు హెచ్ సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని, తాను అడ్డుకుంటుంటే రివర్స్ లో తనపైనే బురదజల్లుతున్నారని ఆయన చెప్పారు. ఆ ఐదుగురే నోటీసులిచ్చి అపెక్స్ కౌన్సిల్ ఇచ్చినట్టు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

మరోపక్క, ఇవాళ్టి నుంచి హెచ్ సీఏకి అధ్యక్షుడు అజర్ కాదని, దీంట్లో బీసీసీఐ జోక్యం ఉండబోదని అపెక్స్ కౌన్సిల్ తేల్చి చెప్పింది. సమావేశాలకు అధ్యక్ష హోదాలో ఆయన రాబోరని స్పష్టం చేసింది. జస్టిస్ లోధా కమిషన్ సిఫార్సుల మేరకు అజారుద్దీన్ కు నోటీసులు ఇచ్చామని ప్రకటించింది. కౌన్సిల్ లోని సభ్యుల్లో ఐదుగురు ఆ నిర్ణయం తీసుకున్నారని, వారిని ‘ఓ వర్గం’ అని పోల్చడం మంచిది కాదని సూచించింది.

అదేమీ ఎన్నికైన కౌన్సిల్ కాదని, ఆ ఐదుగురే అపెక్స్ కౌన్సిల్ అని తేల్చి చెప్పింది. హెచ్ సీఏ అధ్యక్షుడిని మినహాయిస్తే కౌన్సిల్ లో 9 మంది సభ్యులుంటారన్న అపెక్స్ కౌన్సిల్.. పురుషుల జట్టు నుంచి ఇద్దరు, మహిళా జట్టు నుంచి మరో ఇద్దరు సభ్యులుగా ఉంటారని చెప్పింది. మిగతా ఆ ఐదుగురే అసలైన అపెక్స్ కౌన్సిల్ అని పేర్కొంది.

More Telugu News