Chiranjeevi: 'ఠాగూర్' సీక్వెల్ పై స్పందించిన వినాయక్! 

 Vinayak reacted on Tagore sequel
  • 'ఠాగూర్' సినిమా ఒక అద్భుతం
  • సీక్వెల్ ఆలోచన సాహసమే
  • సీక్వెల్ కథ అంతకుమించి ఉండాలి
చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'ఠాగూర్' ఒకటిగా కనిపిస్తుంది. వినాయక్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ సినిమా, సంచలన విజయాన్ని సాధించింది. మురుగదాస్ కథ .. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. వినోదంతో పాటు సందేశాన్ని అందించిన ఈ సినిమాను, ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ  విషయాన్ని గురించి వినాయక్ ప్రస్తావించాడు.

'ఠాగూర్' సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆశ ... ఆసక్తి నాకూ ఉన్నాయి. కానీ అద్భుతమనేది ఎప్పుడైనా ఒక్కసారే జరుగుతుంది. నా దృష్టిలో అలాంటి అద్భుతమే 'ఠాగూర్' సినిమా. అన్నివర్గాల ప్రేక్షకులను అంతగా ప్రభావితం చేసిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది. సీక్వెల్ ఎప్పుడూ కూడా ముందుగా వచ్చిన సినిమాకి మించి ఉండాలి. అలా ఉందనే నమ్మకం దర్శకుడికి కలగాలి .. అదే అభిప్రాయం జనం నుంచి రావాలి. లేదంటే ముందుగా తెచ్చిన పేరు చెడగొట్టినట్టు అవుతుంది. అందువలన 'ఠాగూర్' సీక్వెల్ ఆలోచన చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు.
Chiranjeevi
Jyothika
VV Vinayak

More Telugu News