Corona Virus: వ్యాక్సిన్‌ సామర్థ్యంపై డెల్టా ప్లస్ వేరియంట్‌ ప్రభావం: రణ్‌దీప్‌ గులేరియా

  • ఈ కొత్త రకంపై మోనోక్లోనల్‌ యాంటీబాడీ థెరపీ పనిచేయదు
  • వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకే అవకాశం ఉంది
  • అయితే, మరణాలు, అనారోగ్య తీవ్రత తగ్గుతుంది
  • కరోనా కట్టడి నిబంధనలు పాటించకపోతే మూడో వేవ్‌
  • వెల్లడించిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా
delta Plus Variant effects Vaccine Efficacy

కరోనా వ్యాక్సిన్‌ సామర్థ్యంపై డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వెల్లడించారు. అయినప్పటికీ టీకాలు మాత్రం సమర్థంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌ ఇంకా ఆందోళనకర స్థాయికి చేరలేదని పేర్కొన్నారు.

అయితే, భారత్‌లో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్‌ యాంటీబాడీ థెరపీ దీనిపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు. మరోవైపు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా వైరస్‌ సోకే అవకాశం ఉందన్నారు. అయితే, మరణాల్ని, తీవ్ర అనారోగ్యాన్ని తగ్గించడమే టీకా ముఖ్యోద్దేశమని తెలిపారు.

కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచడం వల్ల రోగనిరోధకత మరింత పెరుగుతుందని ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోందని గులేరియా స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం అందుబాటులోకి వస్తున్న కొద్దీ అవసరమైన మేర మార్పులు చేర్పులు ఉంటాయన్నారు.

ఇక ప్రజలు కరోనా కట్టడి నిబంధనల్ని తప్పక పాటించాల్సిందేనన్నారు. మూడో వేవ్‌ తలెత్తడం అన్నది ప్రజలు వ్యవహరించే తీరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. గుంపులుగా సమావేశం కాకుండా గట్టి నిఘా ఉంచడం సహా ఇతర కట్టడి నిబంధనల్ని పాటించడం, వ్యాక్సినేషన్‌ పురోగతిపైనే కరోనా మూడో దశ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

More Telugu News