Cristinao Ronaldo: సాకర్ స్టార్ రొనాల్డో చర్యతో దారుణంగా పడిపోయిన కోకాకోలా మార్కెట్ వాల్యూ

Ronaldo causes dip in Cocacola share value
  • ప్రెస్ మీట్లో కోకాకోలా సీసాలు పక్కకి నెట్టేసిన రొనాల్డో
  • నీళ్లు తాగేందుకు ప్రాధాన్యత
  • యూరో కప్ టోర్నీ స్పాన్సర్ గా కోకాకోలా
  • పతనమైన షేర్ వాల్యూ
సాకర్ ప్రపంచంలో పోర్చుగీస్ యోధుడు క్రిస్టియానో రొనాల్డో (36)కు ఉన్నంత క్రేజ్ మరే సాకర్ ఆటగాడికీ లేదనడం అతిశయోక్తి కాదు. వయసు పెరిగినా వన్నె తగ్గని ఆటగాడిగా వరల్డ్ వైడ్ పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. రొనాల్డో మార్కెట్ వాల్యూ వందల కోట్లు దాటి చాలా ఏళ్లయింది. రొనాల్డో మైదానంలోనే కాదు బయట కూడా ఎంత ప్రభావం చూపగలడో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం.

యూరో కప్ సాకర్ టోర్నీలో ఓ ప్రెస్ మీట్ లో తనముందున్న రెండు కోకాకోలా బాటిళ్లను పక్కకి నెట్టేసిన రొనాల్డో చర్య సంచలనం సృష్టించింది. కోకాకోలా బదులు మంచినీళ్ల బాటిల్ పైకెత్తి గడగడా తాగేసి "ఆగ్వా" (పోర్చుగీసు భాషలో మంచినీళ్లు) అని పేర్కొన్నాడు. ఇంకేముందీ... అంతర్జాతీయ మార్కెట్లో కోకాకోలా షేర్ వాల్యూ పతనం కావడం, మొత్తమ్మీద రూ.29 వేల కోట్ల నష్టం రావడం చకచకా జరిగిపోయాయి. దటీజ్ రొనాల్డో!

రొనాల్డో కోకాకోలా బాటిళ్లను పక్కకి నెట్టేసిన వీడియో వైరల్ కావడంతో మార్కెట్ పరంగా తీవ్ర ప్రభావం చూపింది. యూరో కప్ ను స్పాన్సర్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థల్లో కోకాకోలా కూడా ఉండడమే అందుకు కారణం. దీనిపై స్పందించిన కోకాకోలా వర్గాలు ఎవరికి నచ్చిన పానీయాలు వారు తాగుతారని పేర్కొంది. యూరో కప్ టోర్నీ సందర్భంగా ప్రెస్ మీట్లలో కోకాకోలా డ్రింక్ లు కూడా అందుబాటులో ఉంచుతున్నామని, పలువురు ఆటగాళ్లు కోకాకోలా డ్రింక్ తాగడం చూసే ఉంటారని పేర్కొన్నాయి.

కాగా, రొనాల్డో తరహాలోనే మరో స్టార్ ఆటగాడు పాల్ పోగ్బా ప్రెస్ మీట్లో తన ముందున్న బీరు సీసాను పక్కకి నెట్టేశాడు. ఇది కూడా వైరల్ అవుతోంది.
Cristinao Ronaldo
Cocacola
Euro Cup
Water
Soccer

More Telugu News