America: పుతిన్‌తో బైడెన్‌ భేటీ.. దశాబ్దం తర్వాత తొలిసారి కలిసిన నేతలు!

  • 2011లో చివరిసారి ఇరువురి మధ్య సమావేశం
  • ఇరు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలు
  • ఈ మధ్యలో పుతిన్‌పై బైడెన్‌ తీవ్ర ఆరోపణలు
  • సైబర్‌క్రైం, ఎన్నికల్లో జోక్యం వంటి ఆరోపణల మధ్య భేటీ
  • సంబంధాల బలోపేతానికీ కృషి చేస్తామని బైడెన్‌ వ్యాఖ్య
american president Biden Met with russian counterpart Putin

చిరకాల ప్రత్యర్థులైన అమెరికా, రష్యా దేశాధినేతలు బైడెన్‌, పుతిన్‌ జెనీవాలో భేటీ అయ్యారు. వీరిరువురు దాదాపు దశాబ్దకాలం తర్వాత కలుసుకోవడం విశేషం. చివరిసారిగా పుతిన్‌ ప్రధానిగా.. బైడెన్‌ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో 2011 మార్చిలో సమావేశమయ్యారు. మరోవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు భారీగా క్షీణించిన సమయంలో వీరి భేటీ జరుగుతుండడం గమనార్హం.

ఉక్రెయిన్, మానవ హక్కులు, సైబర్‌ దాడులు, అమెరికా ఎన్నికల్లో రష్యా పాత్ర వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పుతిన్‌ను బైడెన్‌ కిల్లర్‌గా, సరైన ప్రత్యర్థిగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్ర ఉందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.   సరిగ్గా ఈ తరుణంలో ఇరువురి మధ్య సమావేశాలు జరుగుతుండడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

సైబర్‌క్రైం, అమెరికా ఎన్నికల్లో జోక్యం సహా ఇరు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీసిన పలు అంశాలపై రష్యాతో చర్చించేందుకు అవకాశంగా దీన్ని బైడెన్‌ అభివర్ణించారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికీ ఇదే అవకాశం అని అభిప్రాయపడ్డారు.

More Telugu News