Parliamentary Committee: నేను తప్పు మాట్లాడితే పీఏసీ ఛైర్మన్‌గా తప్పుకుంటా: అధిర్‌ రంజన్‌ చౌధురి

Heated discussion in First PAC Meet Second corona wave
  • కరోనా రెండో ఉద్ధృతి ప్రారంభం తర్వాత తొలి పీఏసీ సమావేశం
  • ఎజెండాకు విరుద్ధంగా కరోనాపై అధిర్‌ చర్చ
  • అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్‌డీఏ సభ్యులు
  • సభ్యుల వాగ్వాదంతో చర్చ రసాభాస
లోక్‌సభలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌధురి అధ్యక్షతన నేడు పార్లమెంటరీ ప్రజా పద్దుల సంఘం భేటీ అయ్యింది. రెండో దశ కరోనా ఉద్ధృతి ప్రారంభమైన తర్వాత ఓ స్థాయి సంఘం భేటీ కావడం ఇదే తొలిసారి. తదుపరి సమావేశాలకు ఎజెండా నిర్ణయించడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. కానీ, అనూహ్యంగా అధిర్‌ రంజన్‌ కొవిడ్‌పై చర్చను ప్రారంభించడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సభ్యులైన జగదాంబిక పాల్‌, లలన్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం రసాభాసగా సాగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అధిర్‌ రంజన్‌ తీరుపై శివసేన వంటి ప్రతిపక్ష పార్టీలు సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పీఏసీ రికార్డుల ప్రకారం.. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ పరిధిలో ఉండే అంశాలను మాత్రమే చర్చించాలని అధిర్‌ రంజన్‌ కు పలువురు సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. అధిర్‌ రంజన్‌ పట్టువీడకపోవడంతో సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. తాను వాస్తవాలు మాత్రమే కమిటీ ముందుకు తీసుకొస్తున్నానని.. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే కమిటీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ సభ్యుడు తెలిపారు.

చివరకు ఇరు వర్గాలు శాంతించడంతో చర్చ ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. అనంతరం తదుపరి సమావేశాలకు సంబంధించిన ఎజెండాను చర్చించినట్లు తెలిపారు.
Parliamentary Committee
PAC
Adhir Ranjan Chowdhury

More Telugu News