Raghu Rama Krishna Raju: రాష్ట్రం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిందంటూ ప్రధానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

  • ప్రతి నెలా రూ.9,226 కోట్ల అప్పులు చేస్తున్నారు 
  • ఎఫ్ఆర్ బీఎం పరిధి మించిపోయారని ఆరోపణ
  • వడ్డీ రూ.35 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది 
  • కేంద్రం జోక్యం చేసుకోవాలని వినతి
Raghurama Krishna Raju wrote PM Modi seeking intervention into AP govt economic crisis

ఏపీ అప్పుల పాలై విలవిల్లాడుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాహతుకు మించి అప్పులు చేయడం వల్ల రాష్ట్రం ఊబిలో చిక్కుకుందని తెలిపారు. 2020లో సగటున ప్రతి నెల రూ.9,226 కోట్లు అప్పు చేశారని వివరించారు. అందులో ఉచిత పథకాల కోసమే రూ.13 వేల కోట్లు తెచ్చారని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఎఫ్ఆర్ బీఎం పరిధికి మించి అప్పులు చేశారని, దాని ఫలితంగా అప్పులకు వడ్డీ రూపేణా సుమారు రూ.35 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తోందని లేఖలో తెలిపారు.

ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్డీసీకి బదలాయించి, ఆ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నారని వివరించారు. ఇప్పటికే ఏపీఎస్డీసీ పలు బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల మేర అప్పులు తీసుకుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఉచిత పథకాల అమలుకు మరో రూ.3 వేల కోట్ల రుణాలకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. అంతేకాదు, లులూ గ్రూప్ నుంచి భూములు వెనక్కి తీసుకుని, వాటిని కూడా తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని ఆరోపించారు.

ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని, కేంద్రం జోక్యం చేసుకుని ప్రజల ఆస్తులను కాపాడాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. ప్రజాసంక్షేమం ముసుగులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

More Telugu News