Noor Fathima: మా కంటి'పాప' దూరమైంది... మీ విరాళాలు తిరిగిచ్చేస్తాం: ఓ తండ్రి కన్నీటిపర్యంతం

Rajasthan child Noor Fathima dies of SMA
  • ఎస్ఎంఏతో బాధపడుతున్న రాజస్థాన్ చిన్నారి
  • క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.40 లక్షల సేకరణ
  • ఓ ఉదయం అస్వస్థతకు గురైన పసిబిడ్డ
  • విషాదంలో ముంచెత్తుతూ తిరిగిరాని లోకాలకు పాప!
స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ... సంక్షిప్తంగా ఎస్ఎంఏ. ఇది అత్యంత అరుదైన వ్యాధి. కోట్లలో ఏ ఒక్కరో దీని బారినపడుతుంటారు. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా అందించే జీన్ జోల్ స్మా ఇంజెక్షన్ ఒక్కటి దిగుమతి సుంకం మినహాయిస్తే రూ.16 కోట్ల ఖరీదు చేస్తుంది. ఇటీవల హైదరాబాద్ కు చెందిన అయాన్ష్ గుప్తా అనే చిన్నారి ఎస్ఎంఏతో బాధపడుతుండడంతో, అతడి తల్లిదండ్రులు ఇంత మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించుకోగలిగారు.

ఇదే రీతిలో రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన నూర్ ఫాతిమా అనే 7 నెలల పాప కూడా ఎస్ఎంఏతో బాధపడుతోంది. ఆమె తండ్రి జిషాన్ అహ్మద్ పేదవాడు కావడంతో తమ చిన్నారిని బతికించుకోవడంపై తీవ్ర ఆవేదన చెందేవాడు. హైదరాబాద్ చిన్నారి అయాన్ష్ గుప్తాకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కోట్ల రూపాయలు సమకూరాయని తెలుసుకున్న జిషాన్ లోనూ ఆశలు మొలకెత్తాయి.

తన మిత్రులు, ఇతర సోషల్ మీడియా గ్రూపుల సాయంతో కొన్నిరోజుల్లోనే రూ.40 లక్షల వరకు పోగు చేశాడు. కానీ చిన్నారి పాప నూర్ ఫాతిమా అందరినీ విషాదంలో ముంచెత్తుతూ తిరిగిరాని లోకాలకు తరలివెళ్లింది.

ఓ ఉదయం వేళ ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతుండడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపం... ఆ పసిబిడ్డ అప్పటికే చనిపోయిందట! ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణనాతీతం! ఇంత విషాదంలోనూ పాప తండ్రి జిషాన్ నిజాయతీని వీడలేదు. తన పాప కోసం విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతూ, పాప కోసం సేకరించిన విరాళాలను తిరిగిచ్చేస్తామని ప్రకటించాడు. విరాళాలు వచ్చినా పాపను బ్రతికించుకోలేకపోయామని ఆ తండ్రి భోరున విలపించాడు.
Noor Fathima
SMA
Death
Zishan
Father

More Telugu News