పంజాబ్​ సీఎం ఇంటి ముందు భారీ నిరసన

15-06-2021 Tue 14:45
  • ముట్టడికి ప్రయత్నించిన శిరోమణి అకాలీ దళ్ నేతలు
  • సీఎం ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు
  • ఎస్ఏడీ చీఫ్ సుక్బీర్ సింగ్ బాదల్ అరెస్ట్
  • తుపాను చెలరేగితే ఆపడం సీఎం తరం కాదని హెచ్చరిక
SAD chief Sukhbir Singh Badal detained by Punjab Police amid protest outside CM Amarinder Singh residence

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాసాన్ని ముట్టడించేందుకు శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. శిశ్వాన్ లోని ఆయన ఇంటి ముందు భారీ నిరసనకు దిగారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ తో ఆ పార్టీ నేతలు చేసిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఎం ఇంటి ముందు పోలీసులను భారీగా మోహరించారు.

ఇంట్లోకి చొచ్చుకెళ్లకుండా పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఏడీ అధిపతి సుక్బీర్ సింగ్ బాదల్ ను అరెస్ట్ చేశారు. కరోనా పేషెంట్ల కోసం తెచ్చిన మెడికల్ కిట్లు, కరోనా వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకోవడం వంటి ఘటనలపై మంత్రిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ పంజాబ్ అధ్యక్షుడు జస్బీర్ సింగ్ గర్హీ కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు.

తుపాను చెలరేగితే కెప్టెన్ తట్టుకోలేరని, ఆయన తన బలగాన్ని మొత్తం వాడినా దానిని ఆపతరం కూడా కాదని సుక్బీర్ సింగ్ బాదల్ హెచ్చరించారు. ఎక్కడ చూసినా కుంభకోణాలే జరుగుతున్నాయని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ లో కుంభకోణం.. మెడికల్ కిట్లలో కుంభకోణం.. ఎస్సీ స్కాలర్ షిప్పుల్లో కుంభ కోణం.. ఇలా ఎన్నెన్నో స్కాంలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.