బీజేపీలో చేరేముందే ఈటలకు పరాభవం: క‌డియం శ్రీహ‌రి

15-06-2021 Tue 13:19
  • నడ్డా సమక్షంలో ఆయ‌న ఎందుకు చేరలేదో చెప్పాలి
  • ఆస్తులను కాపాడుకోవ‌డానికే ఆయ‌న బీజేపీలో చేరిన‌ట్లుంది
  • ఇన్నాళ్లు బీజేపీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు
  • ఇప్పుడు అదే పార్టీలో చేరారు
kadiyam srihari slams etela

బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహ‌రి మండిప‌డ్డారు. ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో కాకుండా కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్  స‌మ‌క్షంలో ఈట‌ల బీజేపీలో చేర‌డంపై కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీలో చేరేముందే ఈటలకు పరాభవం ఎదురైందని, నడ్డా సమక్షంలో ఆయ‌న‌ ఎందుకు చేరలేదో చెప్పాలని నిల‌దీశారు.

ఆస్తులను కాపాడుకోవ‌డానికే ఆయ‌న బీజేపీలో చేరిన‌ట్లుంద‌ని కడియం శ్రీహ‌రి అన్నారు. ఇన్నాళ్లు బీజేపీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించిన ఆయ‌న ఇప్పుడు అదే పార్టీలో చేరడం  సిగ్గుచేటని క‌డియం శ్రీ‌హ‌రి విమ‌ర్శించారు. ఈట‌ల‌కు టీఆర్‌ఎస్‌ రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని, ఈ పార్టీలో అన్ని పదవులను అనుభవించి ఇప్పుడు ఆ పార్టీపైనే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.