బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య?

15-06-2021 Tue 11:22
  • బోయపాటి తాజా చిత్రంగా 'అఖండ'
  • బాలకృష్ణతో మూడో సినిమా
  • నెక్స్ట్ మూవీ బన్నీతో అంటూ టాక్
  • సూర్యకు కథ చెప్పిన బోయపాటి 
Boyapati next movie with surya

బోయపాటి తాజా చిత్రంగా 'అఖండ' సెట్స్ పై ఉంది. బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' సంచలన విజయాలను నమోదు చేయడంతో, సహజంగానే ఈ సినిమాను గురించి ఒక రేంజ్ లో ఊహించుకుంటున్నారు. ఇటీవల వచ్చిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. దసరాకి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉండవచ్చని అంతా అనుకుంటున్నారు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో సూర్యకు కూడా బోయపాటి ఒక  కథను వినిపించినట్టుగా చెప్పుకుంటున్నారు. కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. నేరుగా తెలుగులో రూపొందే ఈ సినిమా, తమిళంలోనూ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అల్లు అర్జున్ ప్రాజెక్టు ఆలస్యమైతే ముందుగా సూర్యతోనే బోయపాటి సినిమా ఉంటుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.