షూటింగుకి రెడీ అవుతున్న పవన్!

15-06-2021 Tue 10:22
  • సెట్స్ పై రెండు సినిమాలు
  • కరోనా వలన ఆగిన షూటింగు
  • వచ్చేనెలలో మళ్లీ సెట్స్ పైకి  
Pavan kalyan remake movie update

పవన్ కల్యాణ్ చేస్తున్న రెండు ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా కూడా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. అదే సమయంలో కరోనా తీవ్రత పెరగడంతో రెండు సినిమాల షూటింగులు కూడా ఆగిపోయాయి.

అయితే ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతూ వెళుతోంది. దాంతో ఒక్కొక్కరుగా మళ్లీ షూటింగ్స్ కి బయలుదేరుతున్నారు. పవన్ కూడా వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. 'హరి హర వీరమల్లు' పెద్ద ప్రాజెక్టు .. అందువలన దానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ముందుగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశంతో పవన్ ఉన్నారట. అందువలన ఈ సినిమా సెట్స్ పైకే ఆయన ముందుగా వెళ్లనున్నాడని చెబుతున్నారు. ఇందులో రానా కూడా ఓ కీలకమైన పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే.