కరోనా మూడో వేవ్, హెల్త్ హబ్స్ పై సీఎం జగన్ సమీక్ష

14-06-2021 Mon 19:49
  • థర్డ్ వేవ్ పై నిపుణుల అంచనాలు
  • అధికారులతో చర్చించిన సీఎం జగన్
  • చిన్నారులకు సమస్యలు వస్తున్నాయన్న అధికారులు
  • ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలని ఆదేశాలు
CM Jagan review and discuss in corona third wave

కరోనా థర్డ్ వేవ్ తప్పదని, చిన్నారులు అత్యధికంగా కరోనా బారినపడే ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా తీరుతెన్నులపై, ముఖ్యంగా చిన్నారులపై కరోనా ప్రభావం గురించి సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా తగ్గిన తర్వాత కూడా చిన్నారులకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని అధికారులు వివరించారు.

 ఈ క్రమంలో, చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. చిన్నారుల వైద్యానికి సంబంధించిన పీడియాట్రిక్స్ అంశాల్లో నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.

అంతేకాకుండా, సీఎం రాష్ట్రంలో హెల్త్ హబ్స్ అంశంపైనా అధికారులతో చర్చించారు. హెల్త్ హబ్స్ జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆసుపత్రులు తీసుకురావాలని పేర్కొన్నారు. రెండు వారాల్లోగా హెల్త్ హబ్స్ పై విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు నిర్దేశించారు.