రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సీఎం జగన్ దంపతులు

14-06-2021 Mon 18:12
  • గవర్నర్ తో జగన్ సమావేశం
  • 40 నిమిషాల పాటు చర్చలు
  • నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చలు!
CM Jagan met governor in Rajbhavan

సీఎం జగన్ దంపతులు నేడు విజయవాడలోని రాజ్ భవన్ కు విచ్చేశారు. సీఎం జగన్, వైఎస్ భారతి.... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. కాగా, ఏపీ అంశాలపై గవర్నర్, సీఎం జగన్ ల మధ్య చర్చ జరిగింది.ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. ప్రధానంగా నామినేటెడ్ ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రమేశ్ యాదవ్, మోషేన్ రాజుల పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా, దీనిపైనా సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం. భేటీ అనంతరం సీఎం జగన్ దంపతులు తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.

నలుగురు ఎమ్మెల్సీలను గవర్నర్ నామినేట్ చేయాల్సి ఉండగా, వారి పేర్లను ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదించింది. అయితే ఈ ఫైలును గవర్నర్ బిశ్వభూషణ్ నిలిపి ఉంచినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్... గవర్నర్ కు ఎమ్మెల్సీల అంశాన్ని వివరించినట్టు తెలుస్తోంది.