మళ్లీ థియేటర్లలో దిగనున్న 'వకీల్ సాబ్'?

14-06-2021 Mon 17:08
  • హిట్ టాక్ తెచ్చుకున్న 'వకీల్ సాబ్'
  • అమెజాన్ ప్రైమ్ లోను పలకరించిన మూవీ
  • మళ్లీ రిలీజ్ చేసే ఆలోచనలో దిల్ రాజు
Vakeel Saab is going to release again

రాజకీయాలలోకి వెళ్లిన పవన్ కల్యాణ్, కొంత గ్యాప్ తరువాత 'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, నివేదా థామస్ .. అంజలి .. అనన్య ముఖ్యమైన పాత్రల్లో మెప్పించారు. హిందీలో విజయం సాధించిన 'పింక్'కి రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను 'వకీల్ సాబ్' భారీ వసూళ్లను రాబట్టింది. పవన్ రీ ఎంట్రీ ఒక సూపర్ హిట్ మూవీతో జరగడం పట్ల ఆయన అభిమానులంతా కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే థియేటర్స్ లో ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లను కొల్లగొడుతూ ఉండగా, కరోనా తీవ్రత పెరిగింది. దాంతో థియేటర్స్ దగ్గర జనం పలచబడటం .. ఆ తరువాత థియేటర్లు మూతబడటం జరిగిపోయింది. ఆ తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో థియేటర్లు తెరుచుకోనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 300 థియేటర్లలో 'వకీల్ సాబ్'ను మళ్లీ రిలీజ్ చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడని అంటున్నారు.