వుహాన్ ల్యాబ్ లో గబ్బిలాలు... స్కై న్యూస్ ఆసక్తికర వీడియో

14-06-2021 Mon 16:30
  • కరోనా మూలాలపై ఇప్పటికీ అనిశ్చితి
  • వుహాన్ ల్యాబ్ పై బలమైన అనుమానాలు
  • 2017లోనే గబ్బిలాల పెంపకం
  • నాటి వీడియోను సంపాదించిన స్కై న్యూస్
Bats in Wuhan lab as per Sky news video

చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న వైరాలజీ ల్యాబ్ కరోనా నేపథ్యంలో ఎంతో అప్రదిష్ఠ మూటగట్టుకుంది. ఇక్కడి నుంచే కరోనా వైరస్ లీకై యావత్ ప్రపంచానికి వ్యాపించిందన్న తీవ్ర ఆరోపణలు ఇప్పటికీ బలంగా వినిపిస్తున్నాయి. అమెరికాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా వుహాన్ ల్యాబ్ నే వేలెత్తి చూపిన సందర్భాలు అనేకం.

తాజాగా, స్కై న్యూస్ మీడియా సంస్థ మరో సంచలన వీడియోతో వుహాన్ ల్యాబ్ ను ఇరకాటంలో పడేసింది. ప్రమాదకర వైరస్ లకు ఆవాసంగా ఉండే గబ్బిలాలను వుహాన్ ల్యాబ్ లో పెంచుతున్న విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించింది. ఈ వీడియో నిడివి 10 నిమిషాలు. బోనుల్లో ఉన్న గబ్బిలాలకు వుహాన్ ల్యాబ్ పరిశోధకులు పురుగులను ఆహారంగా అందిస్తుండడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో 2017 నాటిది. నాడు వుహాన్ ల్యాబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వీడియోను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చిత్రీకరించింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఇటీవల కరోనా పుట్టుక మూలాలను నిగ్గు తేల్చేందుకు వుహాన్ లో పర్యటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం ఈ గబ్బిలాల పెంపకం విషయాన్ని తన నివేదికలో ఎక్కడా పేర్కొనలేదు. గతంలోనూ డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు పీటర్ డెస్ జాక్ వుహాన్ ల్యాబ్ కు గబ్బిలాలను నేరుగా తీసుకురాలేదని, అడవుల్లో వాటి నుంచి నమూనాలు సేకరించాక, వాటిని అక్కడే వదిలేసినట్టు పేర్కొన్నారు. కానీ, తాజాగా స్కై న్యూస్ సంపాదించిన వీడియోలో మాత్రం వుహాన్ ల్యాబ్ లో గబ్బిలాలు ఉన్న విషయం స్పష్టమైంది.

కాగా, వుహాన్ ల్యాబ్ లోని పీ-4 విభాగంలోనే ఈ గబ్బిలాలు దర్శనమిచ్చాయి. అయితే, ప్రపంచానికి కరోనా గురించి తెలియకముందే ఈ పీ-4 విభాగానికి చెందిన సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న విషయం కరోనా మూలాలపై అనుమానాలను మరింత పెంచుతోంది. ఈ అంశంపై గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా కథనాన్ని ప్రచురించింది.