బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్.. కాషాయ కండువా క‌ప్పిన కేంద్ర‌మంత్రి

14-06-2021 Mon 12:12
  • ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈట‌ల‌
  • ఏనుగు ర‌వీంద‌ర్ త‌దిత‌రులు కూడా చేరిక 
  • పార్టీలోకి ఆహ్వానించిన ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్
etela joins in bjp

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ కండువా కప్పి ఆయనను ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ త‌మ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో పాటు మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, తెలంగాణ‌ ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి త‌దిత‌రులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు ప‌లువురు బీజేపీ నేత‌లు హాజ‌ర‌య్యారు.

కాగా, ఈ రోజు ఉదయం 5 గంటలకే శామీర్ పేట్‌లోని త‌న‌ నివాసం నుంచి ఈట‌ల‌ బయలుదేరారు. ఈ రోజు ఉద‌యం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ఆయ‌న ప‌లువురు బీజేపీ కీల‌క నేత‌ల‌ను క‌లిసే అవ‌కాశం ఉంది. రేపు ఈట‌ల తిరిగి హైద‌రాబాద్ రానున్నారు.