Avanthi Srinivas: మా పోరాటం టీడీపీపై కాదు.. పేదరికాన్ని పోగొట్టడంపైనే: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు

Avanthi Srinivasa Rao warned Govt Land Encroachers
  • ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టబోం
  • ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఇస్తే సరేసరి
  • ఈ రెండేళ్లలో వైసీపీ నేతలు ఒక్క గజమైనా ఆక్రమించారా?
  • చంద్రబాబు నిరూపించగలరా?
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిని ఊరికే విడిచిపెట్టకూడదని, వారికి భయం కలిగేలా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. అలా చేస్తే మరొకరు ఇలాంటి పనిచేయడానికి భయపడతారని అన్నారు. ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానన్నారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించే ఎలాంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకరు ఆ పని చేసేందుకు భయపడతారని అన్నారు. ఇప్పటికే ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని, లేదంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

విశాఖ భూ అక్రమాలపై అందిన సిట్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని అవంతి తెలిపారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు శంకర్రావుకు జగ్గరాజుపేట, తుంగ్లాంలలో బినామీల పేరిట 61 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. ఇందులో 49 ఎకరాలు ప్రభుత్వ భూమేనని అన్నారు. దీని విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 270 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో రూ. 700 కోట్ల పైమాటేనని అన్నారు.

పల్లా కుటుంబ ఆక్రమణలపై చంద్రబాబు, లోకేశ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తమ పోరాటం టీడీపీ మీద కాదని, పేదరికాన్ని తరిమికొట్టడంపైనేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ రెండేళ్లలో వైసీపీ నేతలు ఎవరైనా ఒక్క గజం భూమిని ఆక్రమించినట్టు చంద్రబాబు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అవంతి సవాలు విసిరారు.
Avanthi Srinivas
YSRCP
Chandrababu
Govt Land
Andhra Pradesh

More Telugu News