Hyderabad: ఎంబీటీ నేత వేధింపులు.. మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం

Woman Journalist Suicide Attempt after MBT leader Harassment
  • సయ్యద్ సలీం వేధింపులకు గురిచేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో
  • ఆత్మహత్య తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆవేదన
  • సలీంను అరెస్ట్ చేసిన పోలీసులు
  • దాడికి యత్నించిన మజ్లిస్ కార్యకర్తలు
హైదరాబాద్‌లోని డబీర్‌పురాకు చెందిన ఎంబీటీ నేత సయ్యద్ సలీం (66) వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఆత్మహత్యకు యత్నించారు. సెల్ఫీ వీడియో తీసుకుని నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. గుల్షన్-ఎ-ఇక్బాల్ కాలనీకి చెందిన సయ్యదా నాహీదా ఖాద్రీ (37) ఓ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్నారు. ఎంబీటీ నేత సలీం కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్నారు. అసభ్యకర వీడియోలు, ఫొటోలు  సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఆయన వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఖాద్రీ శనివారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. ఖాద్రీ కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సలీంను అరెస్ట్ చేశారు.

సలీం అరెస్ట్ విషయం తెలుసుకున్న మజ్లిస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సలీంపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సలీం తనను వేధిస్తున్నట్టు బాధితురాలు ఖాద్రీ మే 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన నిందితుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమెను దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఖాద్రీ.. 20 రోజులుగా నరకం అనుభవిస్తున్నానని, తనకు ఆత్మహత్య తప్ప మరో దారి కనిపించడం లేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ నిద్రమాత్రలు మింగారు.
Hyderabad
MBT
Sayed Saleem
Woman Journalist
Suicide

More Telugu News