YS Jagan: ప్రశ్నించిన వారి ఆస్తులను కూల్చివేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు: అచ్చెన్నాయుడు మండిపాటు

  • అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో కట్టింది ఒకటీ లేదు
  • కూల్చివేతలకు మాత్రం లెక్కలేదు
  • ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది
TDP AP Chief Atchannaidu fires on Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  జగన్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క కొత్త నిర్మాణం కూడా చేపట్టలేదని, కానీ కూల్చివేతలకు మాత్రం లెక్కలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారి ఆస్తులను కూల్చివేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

 చూస్తుంటే జగన్ ‘సెలవు రోజుల్లో విధ్వంసం’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. విశాఖలో సబ్బంహరి, వెలగపూడి రామకృష్ణ, గీతం విద్యా సంస్థలపై ఆక్రమణల పేరుతో దాడులు చేసి భయాందోళనలు రేకెత్తించారని అన్నారు. ఇప్పుడేమో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్థలంలో అధికారులు ఫెన్సింగ్ తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీనివాసరావు భూములను పరిశీలించిన అధికారులు అన్నీ సక్రమంగా ఉండడంతో యాదవ జుగ్గరాజుపేట చెరువుకు చెందిన రెండు అడుగుల స్థలాన్ని ఆక్రమించారని ఫెన్సింగ్ తొలగించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్రలో ప్రశాంతతను దూరం చేస్తున్న వైసీపీకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

More Telugu News