Suhasini: నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో తెరపైకి రెండోభర్త!

Suhasini second husband comes forth on cheating
  • మూడు పెళ్లిళ్లు చేసుకున్న సుహాసిని
  • తిరుపతిలో ఫిర్యాదు చేసిన మూడో పెళ్లికొడుకు
  • తాను కూడా అలాగే మోసపోయానన్న కొత్తగూడెం వాసి
  • ఆమె మోసాలను అరికట్టాలని పోలీసులకు విజ్ఞప్తి
నిత్య పెళ్లికొడుకు అంటూ మీడియాలో కథనాలు రావడం కొత్తేమీ కాదు. కానీ ఓ యువతి వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ, లక్షల్లో బురిడీ కొట్టిస్తూ నిత్య పెళ్లికూతురు ముద్ర వేయించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. సుహాసిని అనే యువతి ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకోగా, మూడో పెళ్లి కొడుకు ఫిర్యాదుతో ఆమె బండారం బట్టబయలైంది. తిరుపతిలో వెలుగు చూసిన ఈ కేసు తెలంగాణలోనూ ప్రకంపనలు రేకెత్తించింది.

తాజాగా కొత్తగూడెంకు చెందిన వినయ్... తాను సుహాసిని రెండో భర్తనంటూ తెరపైకి వచ్చాడు. తనను కూడా సుహాసిని రూ.15 లక్షల మేర మోసగించిందని తెలిపాడు. తనను తాను అనాథగా పరిచయం చేసుకుందని, 2018లో తామిద్దరికి పరిచయం ఏర్పడిందని వినయ్ తెలిపాడు. అనాథనని చెప్పడంతో, ఆ మరుసటి ఏడాదే పెళ్లి చేసుకున్నానని వెల్లడించాడు. పెళ్లి సమయంలో వెంకటేశ్వరరాజు అనే వ్యక్తిని మేనమామగా పరిచయం చేసిందని, ఇద్దరు పిల్లలను తీసుకువచ్చి మేనకోడళ్లు అని చెప్పిందని వినయ్ వివరించాడు.

అయితే, నెల రోజుల తర్వాత నుంచి సుహాసిని ప్రవర్తనలో తేడా కనిపించిందని చెప్పాడు. ఆమె మొదట చెప్పిన మేనమామే ఆమె తొలి భర్త అని, మేనకోడళ్లుగా పరిచయం చేసిన పిల్లలు ఆమె పిల్లలేనని వెల్లడైందని వినయ్ తెలిపాడు. తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అప్పటి సీఐ ఫిర్యాదు స్వీకరించలేదని, ఇది జరిగిన కొన్నిరోజులకే ఇంట్లో నగదు, బంగారం తీసుకుని సుహాసిని గోడ దూకి పారిపోయిందని తెలిపాడు.

ఇప్పుడు తిరుపతిలో ఆమె మూడో పెళ్లి వ్యవహారం తెలియడంతో అందరి ముందుకు వచ్చానని వినయ్ పేర్కొన్నాడు. సుహాసిని తన మొదటి భర్త వెంకటేశ్వరరాజుతో కలిసి మోసాలకు పాల్పడుతోందని, ఆమె మోసాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశాడు.
Suhasini
Vinay
Second Marriage
Kothagudem
Three Marriages

More Telugu News