భారత్ తో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ కు ఊపునిచ్చే విజయం

13-06-2021 Sun 17:18
  • ఇంగ్లండ్ తో రెండో టెస్టులో కివీస్ విజయం
  • 1-0తో సిరీస్ కైవసం
  • ఈ నెల 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
  • భారత్ వర్సెస్ న్యూజిలాండ్
New Zealand registers a thumping win over England ahead of WTC summit clash with India

ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ జట్టు మాంచి ఊపునిచ్చే విజయం అందుకుంది. ఇంగ్లండ్ తో రెండు టెస్టుల సిరీస్ ను 1-0తో కైవసం చేసుకుంది.

నేడు ఎడ్జ్ బాస్టన్ లో ముగిసిన రెండో టెస్టులో కివీస్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. 38 పరుగుల విజయలక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెగ్యులర్ సారథి కేన్ విలియమ్సన్ లేకపోయినా, తాత్కాలిక సారథి టామ్ లాథమ్ నాయకత్వంలో సాధించిన ఈ గెలుపు... భారత్ తో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహంలేదు.

కాగా, ఫైనల్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ లోనే ఉన్న భారత జట్టు ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయి సన్నాహక మ్యాచ్ లు ఆడుతున్నారు. ఈ ప్రాక్టీసు మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం 94 బంతుల్లో 121 పరుగులు చేసి తన విధ్వంసక ఫామ్ నిరూపించుకున్నాడు. కొత్త పేస్ బౌలర్ ఆవేశ్ ఖాన్ కూడా ఆకట్టుకునేలా బౌలింగ్ చేసినట్టు తెలుస్తోంది. మరి, అతడికి తుదిజట్టులో స్థానం లభిస్తుందో, లేదో చూడాలి.