కరోనా టెస్ట్​ చేస్తుంటే.. పుల్ల విరిగి ముక్కులో ఇరుక్కుంది: తెలంగాణలో ఘటన

13-06-2021 Sun 12:37
  • కరీంనగర్ జిల్లాలోని వెంకట్రావ్ పల్లి సర్పంచ్ కు చేదు అనుభవం
  • ప్రైవేట్ ఆసుపత్రిలో ఎండోస్కోపీ ద్వారా తీసేసిన వైద్యులు
  • ముక్కులో నుంచి గొంతులోకి జారిన శ్వాబ్ స్టిక్
Swab stick breaks gets stuck in throat of village sarpanch in Telangana

కరోనా టెస్ట్ కోసం ముక్కు నుంచి శాంపిల్ తీస్తుండగా ఆ పుల్ల (శ్వాబ్ స్టిక్) విరిగి ఇరుక్కుపోయిన ఘటన తెలంగాణలో జరిగింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావ్ పల్లి సర్పంచ్ అయిన జువ్వాజీ శేఖర్.. తమ గ్రామంలో యాంటీ జెన్ టెస్టుల కోసం క్యాంప్ ఏర్పాటు చేయించాడు. అందరికన్నా ముందు తనే టెస్ట్ చేయించుకునేందుకు ముందుకు వచ్చాడు.

గోపాల్ రావ్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది శాంపిల్స్ తీస్తుండగా.. ఆ పుల్ల ఒక్కసారిగా విరిగిపోయి శేఖర్ ముక్కులో ఇరుక్కుపోయింది. స్థానిక వైద్యులు పుల్లను తీసేందుకు ప్రయత్నించినా అది రాలేదు. దీంతో వెంటనే అతడిని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఎండోస్కోపీ చేసి దానిని తొలగించారు. విరిగిన పుల్ల ముక్క, ముక్కు నుంచి గొంతులోకి జారిందని వైద్యులు తెలిపారు.

కోలుకున్న తర్వాత గ్రామ కేంద్రంలో నైపుణ్యంలేని సిబ్బందితో టెస్టులు చేయించారని పిర్యాదు చేశారు. కాగా, అతడికి జరిగిన ఘటనతో గ్రామస్థులు టెస్టు చేయించుకోవాలంటేనే భయపడిపోతున్నారు. అయితే, అధికారులు గ్రామస్థులకు నచ్చజెప్పి వారికి టెస్టులు చేస్తున్నారు. ఆ ఘటన అనుకోకుండా జరిగిందని వివరించి చెప్పారు.