ఈటల తీవ్ర అసహనంతో మాట్లాడుతున్నారు: కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి

12-06-2021 Sat 21:37
  • కౌశిక్ రెడ్డికి కేసీఆర్ డబ్బులు పంపారన్న ఈటల!
  • ఎవరి నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరంలేదన్న కౌశిక్
  • ఈటల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
  • తన ప్రశ్నలకు ఈటల జవాబు చెప్పాలని డిమాండ్
Congress leader Kaushik Reddy slams Eatala

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. తనపై ఈటల అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవులు కోల్పోయిన ఈటల తీవ్ర అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. 2018 ఎన్నికల వేళ కేసీఆర్ తనకు డబ్బులు పంపారని ఈటల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనకు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్న సయయంలో ఈ ఆరోపణలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈటల తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.

"ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ముందు గన్ పార్క్ కు వెళ్లిన ఈటలకు అమరవీరులు ఇన్నాళ్లకు గుర్తుకువచ్చారా? ఈ ఏడున్నరేళ్లలో ఒక్క అమరవీరుల కుటుంబాన్నయినా పరామర్శించారా? అమరవీరుల కుటుంబాల గురించి ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదు? అసైన్డ్ భూములు కొనరాదని ఈటలకు తెలియదా? రెండు ఎకరాలు మాత్రమే ఉన్న ఈటలకు వందల ఎకరాలు ఎలా వచ్చాయి? నానక్ రామ్ గూడలో 15 ఎకరాలు ఏవిధంగా కొన్నారు? కొడుకు పేరు మీద రూ.200 కోట్ల విలువైన భూమి ఎలా వచ్చింది?" అని కౌశిక్ రెడ్డి నిలదీశారు. తాను చెప్పేవి అబద్ధాలైతే హుజూరాబాద్ చౌరస్తాలో తనను ఉరితీయాలని కోరారు.

ఇక, తాను కేటీఆర్ ను కలవడంపై ప్రచారం జరుగుతుండడం పట్ల కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో, టీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కౌశిక్ రెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అక్కడికి వచ్చిన కేటీఆర్ తో మాట్లాడానని, అంతకుమించి ఇతర కారణాలు లేవని వివరించారు.