Corona Virus: దేశంలో మొట్టమొదటిసారి బికనేర్‌లో ఇంటింటికీ టీకా కార్యక్రమం!

  • సోమవారం నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్‌
  • 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు
  • కనీసం 10 మంది రిజిస్టర్‌ చేసుకోవాలి
  • వెంటనే అంబులెన్సు, వైద్య బృందాలు చేరుకుంటాయి
  • పర్యవేక్షణకు ఒక వైద్య సిబ్బంది అక్కడే
In India first time vaccination is going to start in Bikaner

ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం దేశంలో మొట్టమొదటి సారి రాజస్థాన్‌లోని బికనేర్‌ నగరంలో ప్రారంభం కానుంది. సోమవారం నుంచి అక్కడ ‘డోర్‌-టు-డోర్‌’ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఈ కార్యక్రమంలో టీకాలు అందజేస్తారు. రెండు అంబులెన్సులు, మూడు మొబైల్‌ బృందాలు టీకాలు వేయడానికి సిద్ధంగా ఉంటాయి.

ఈ మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం కసరత్తులు ప్రారంభించింది. వాట్సాప్‌ నంబర్‌ ద్వారా పేరు, చిరునామా ఇచ్చే హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ప్రారంభించింది. కనీసం 10 మంది రిజిస్టర్‌ చేసుకున్న ప్రాంతానికి టీకా వేసే బృందాలు వెంటనే బయలుదేరుతాయి. ఒక్క వయల్‌ తెరవగానే వెంటనే పది మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ఆ వయల్‌లోని వ్యాక్సిన్‌ వృథా అయిపోతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వ్యర్థాల్ని అరికట్టడానికే కనీసం 10 మంది రిజిస్టర్‌ చేసుకోవాలన్న నిబంధన విధించారు.

ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి వైద్య బృందం బయలుదేరితే.. సిబ్బందిలో ఒకరు అక్కడే ఉండి టీకా తీసుకున్నవారిని పర్యవేక్షిస్తారు. అలాగే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా సమాచారం ఇస్తారు. తద్వారా టీకా తీసుకున్నవారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే అవకాశం ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 7 లక్షల జనాభా ఉన్న బికనేర్‌లో ఇప్పటికే 60-65 శాతం మంది అర్హులు కరోనా టీకాలు తీసుకున్నారు. నగరంలో మొత్తం 60 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

More Telugu News