మీరు అందించిన విరాళానికి ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాం: బాలకృష్ణ

12-06-2021 Sat 21:01
  • బసవతారకం ఆసుపత్రిలో అమృత సేవ
  • వారానికి మూడుసార్లు ఉచితంగా ఆహారం
  • రూ.14.40 లక్షలు విరాళం అందించిన రుద్రరాజు శ్రీరామరాజు
  • సోషల్ మీడియా ద్వారా స్పందించిన బాలకృష్ణ
Balakrishna responds after Rudrarju Srirama Raju donations towards Amrutha Seva

హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు, వారి సహాయకులకు అమృత సేవ పేరుతో వారానికి మూడు పర్యాయాలు ఉచితంగా ఆహారం అందిస్తారు. ఈ అన్నదాన కార్యక్రమం ప్రధానంగా విరాళాలపైనే ఆధారపడి కొనసాగుతోంది. తాజాగా అమృత సేవ పథకానికి ప్రముఖ వ్యాపారవేత్త రుద్రరాజు శ్రీరామరాజు, ఆయన కుటుంబసభ్యులు రూ.14.40 లక్షలు విరాళంగా అందించారు. దీనిపై బసవతారకం ట్రస్టు చైర్మన్ నందమూరి బాలకృష్ణ స్పందించారు.

అవసరంలో ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడే అన్నదాన కార్యక్రమం అని, ఈ అమృతసేవ పథకానికి విరాళం అందించినందుకు ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టలేమని తెలిపారు. "రుద్రరాజు శ్రీరామరాజు గారూ, మీరు అందించిన ఈ విరాళానికి ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాం" అని పేర్కొన్నారు. ''నేను ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తుండడానికి మీవంటి వారి దాతృత్వమే ఆసరాగా నిలుస్తోంది. మీ విలువైన ఔదార్యం పట్ల మేమెంతో రుణపడి ఉంటాం" అని బాలకృష్ణ ఫేస్ బుక్ లో వివరించారు.