Delta Variant: ఇంటిల్లిపాదికీ వ్యాపిస్తున్న కరోనా డెల్టా వేరియంట్... తాజా అధ్యయనంలో వెల్లడి

  • ఇతర వేరియంట్లతో ఇంటిలో ఒకరికి కరోనా
  • అందరినీ చుట్టేస్తున్న డెల్టా వేరియంట్
  • ఆల్ఫా వేరియంట్ తో పోల్చితే 64 శాతం అధిక వ్యాప్తి
  • పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సంస్థ అధ్యయనం
Public Health England Study about Corona Delta Variant

భారత్ లో తొలిసారి వెలుగుచూసిన బి.1.617.2 కరోనా వేరియంట్ ను డెల్టా వేరియంట్ గా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి మొదలయ్యాక వైరస్ అనేక జన్యు ఉత్పరివర్తనాలకు గురికాగా, ఇప్పటివరకు అన్ని వేరియంట్లలోకి ఈ డెల్టా వేరియంట్ నే అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించారు. కరోనా సెకండ్ వేవ్ లో ఇది భారత్ వెలుపల కూడా గణనీయ ప్రభావం చూపుతోంది. కొద్ది సమయంలోనే ఎక్కువమందికి వ్యాపిస్తోంది.

అయితే, ఈ డెల్టా వేరియంట్ కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని యూకే ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ అనే సంస్థ వెల్లడించింది. ఇతర కరోనా వేరియంట్లు సోకితే సాధారణంగా ఇంట్లో ఒకరు వైరస్ ప్రభావానికి గురయ్యేవారని, కానీ బి.1.617.2 డెల్టా వేరియంట్ తో ఇంట్లోని అందరూ కరోనా బారినపడుతున్నారని, దీని ప్రభావ తీవ్రతకు ఇదే నిదర్శనమని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం వెనుక ఈ వేరియంటే కీలకపాత్ర పోషిస్తోందని పరిశోధకులు వివరించారు.

ఆల్ఫా వేరియంట్ గా పిలిచే బి.1.1.7 తో డెల్టా వేరియంట్ వ్యాప్తిని పోల్చిన అనంతరం పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ ఈ మేరకు నిర్ధారణకు వచ్చింది. ఆల్ఫా వేరియంట్ తో పోల్చితే డెల్టా వేరియంట్ 64 శాతం అధికంగా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు.

More Telugu News