Niti Aayog: కొవిషీల్డ్ డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు: నీతి ఆయోగ్ స‌భ్యుడు వీకే పాల్ వివ‌ర‌ణ‌

  • రెండు డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని  వెంట‌నే త‌గ్గించాలన్న విదేశీ ప‌రిశోధ‌కులు
  • నిర్ణ‌యాలు చాలా జాగ్ర‌త్త‌గా తీసుకోవాల్సి ఉంటుంది
  • ఆయా అంశాల‌ను బ్యాలెన్స్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది
  • ఈ నిర్ణ‌యం వ‌ల్ల చాలా మందికి తొలి డోసు అందుతుంది 
No Need To Panic Over Dose Interval of Covishield Says Centre

కొవిషీల్డ్ మొద‌టి డోసు, రెండో డోసుకు మ‌ధ్య 84 రోజుల వ్య‌వ‌ధి ఉండేలా కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. అయితే, రెండు డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని ఎనిమిది వారాల‌కి త‌గ్గించాల‌ని, అలా చేస్తేనే క‌రోనా వైర‌స్‌ డెల్టా వేరియంట్ (బీ.1.617.2)ను క‌ట్ట‌డి చేసే వ్యాధి నిరోధ‌క శ‌క్తి శ‌రీరంలో అభివృద్ధి చెందుతుంద‌ని ఇటీవ‌ల విదేశీ ప‌రిశోధ‌కుల ప‌రిశోధ‌న‌ల ఫ‌లితాలలో వెల్ల‌డ‌య్యింది.

రెండు డోసులు త్వ‌ర‌గా వేసుకోక‌పోతే వ్యాక్సిన్‌ను త‌ట్టుకునే మ‌రిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా పలువురు నిపుణులు ఆందోళన వెలిబుచ్చారు. అయితే, దీనిపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ‌ స‌భ్యుడు వీకే పాల్ దీనిపై మీడియాతో మాట్లాడుతూ..  'రెండు డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని వెంట‌నే త‌గ్గించాలంటూ వ‌చ్చిన సూచ‌న‌ల విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేదు. ఇటువంటి వాటిల్లో అన్ని నిర్ణ‌యాలు చాలా జాగ్ర‌త్త‌గా తీసుకోవాల్సి ఉంటుంది' అని చెప్పారు.

'ఒక్క డోసు తీసుకున్న వారికి వైర‌స్ వ‌ల్ల ఉన్న ముప్పు అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే రెండు డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని పెంచామ‌న్న విష‌యాన్ని అంద‌రూ గుర్తించాలి. మేము తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల దేశంలో చాలా మందికి తొలి డోసు అందే అవ‌కాశాలు ఉన్నాయి' అని చెప్పారు.

'దీంతో చాలా మందిలో క‌నీస స్థాయిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి అభివృద్ధి చెందుతుంది. ఆయా అంశాల‌ను బ్యాలెన్స్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఏదేమైన‌ప్ప‌టికీ నిపుణుల‌తో అన్ని విష‌యాలు చ‌ర్చించి మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంది' అని వివ‌రించారు.

'డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధి అంశంపై.. న్యూఢిల్లీ కేంద్రంగా ప‌ని చేసే నేష‌న‌ల్ ఇమ్యునైజేష‌న్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఇప్ప‌టికే తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు గౌర‌వించాలి. డోసుల వ్య‌వ‌ధి 12 వారాలు ఉండాల‌ని మొద‌ట యూకే కూడా తెలిపింది' అని వివ‌రించారు.

'అయితే, ఆ స‌మ‌యంలో మ‌న వ‌ద్ద ఉన్న డేటా ప్ర‌కారం అంత వ్య‌వ‌ధి సుర‌క్షితం కాద‌ని మ‌నం అప్ప‌ట్లో భావించాం క‌దా? ఇప్పుడు మ‌నం కూడా అంతే వ్య‌వ‌ధి ఇస్తున్నాం. కాబ‌ట్టి రెండు డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిపై మ‌న ప‌రిశోధ‌కులు ఇప్పుడు మ‌ళ్లీ అధ్యయ‌నం చేయాల్సి ఉంది. మ‌న ప‌రిశోధ‌కులు తీసుకునే నిర్ణ‌యాన్ని మ‌నం గౌర‌వించాల్సి ఉంటుంది'  అని ఆయ‌న చెప్పారు.

More Telugu News