పొదుపు పాటించండి.. ప్రభుత్వ విభాగాలకు కేంద్రం ఆదేశాలు!

11-06-2021 Fri 22:31
  • 20 శాతం ఖర్చులు తగ్గించుకోవాలని సూచన 
  • కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత తొలిసారి
  • వ్యయ నియంత్రణలో భాగంగానే నిర్ణయం
  • కొవిడ్‌ నేపథ్యంలో పూర్తి సామర్థ్యంతో పనిచేయని వ్యవస్థలు
  • ఇదే సరైన తరుణమని కేంద్రం భావన
Centre asks departments to cut expenditure

అదనపు పనిగంటలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, రివార్డుల వంటి వ్యయాలను 20 శాతం మేర తగ్గించుకోవాలని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు కేంద్రం లేఖ రాసింది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ విధంగా వ్యయ నియంత్రణ పాటించాలంటూ ఆదేశించడం ఇదే తొలిసారి.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌పెండీచర్‌ విభాగం అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సహా సంబంధిత యంత్రాంగాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికలో లేని, అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అందుకు 2019-20ని బేస్ ఇయర్‌గా తీసుకోవాలని సూచించింది.

అయితే, కొవిడ్‌ మహమ్మారి కట్టడికోసం కేటాయించిన నిధులకు మాత్రం వ్యయ నియంత్రణ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో వ్యవస్థలేవీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని వ్యయ నియంత్రణకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడింది.