పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

11-06-2021 Fri 19:54
  • ఏపీలో పరీక్షలు వాయిదా వేసిన సర్కారు
  • రద్దు చేయాలంటున్న లోకేశ్
  • ప్రాణాలతో చెలగాటం వద్దని హితవు
  • కరోనా ముప్పు తొలగిపోలేదని వెల్లడి
  • ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని వివరణ
Nara Lokesh wrote CM Jagan to cancel Tenth and Inter exams

ఏపీలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు, సీబీఎస్ఈ కూడా పరీక్షలు రద్దు చేశాయని, ఏపీ సర్కారు కూడా సానుకూలంగా స్పందించి పరీక్షలు రద్దు చేయాలని కోరారు. కొవిడ్ భయంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. తమ పిల్లలను పరీక్షలకు పంపించేందుకు వారు మానసికంగా సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

కరోనా ఇప్పటికీ వ్యాప్తిలోనే ఉందని, ఈ క్రమంలో 80 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం తగదని లోకేశ్ పేర్కొన్నారు. మే నెలలోని చివరి 2 వారాల్లో నమోదైన 2.3 లక్షల కేసుల్లో 10 శాతం కంటే ఎక్కువ కేసులు 18 ఏళ్ల లోపు వయసు వారిలోనే నమోదయ్యాయని వివరించారు. ఇటువంటి తీవ్ర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం విద్యార్థులను మరింత ప్రమాదంలోకి నెట్టడమేనని వ్యాఖ్యానించారు.

పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా కోరుతున్నారని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ విద్యార్థులకే కాకుండా, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలకు కూడా ముప్పుగా పరిణమిస్తుందని లోకేశ్ హెచ్చరించారు.

దేశంలో కనీసం 15 రాష్ట్రాలు 10, 11, 12వ తరగతి పరీక్షలు రద్దు చేశాయని వివరించారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్ధుల ఆరోగ్యానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, వారి జీవితాలకు విలువనిస్తున్నాయని తెలిపారు. ఆయా పరీక్షలకు ప్రత్యామ్నాయాలు రూపొందించడం ద్వారా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేశాయని లోకేశ్ తన లేఖలో వెల్లడించారు.

ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానం ప్రకారం... 10, 11, 12వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్, ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వొచ్చని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా సీఎం జగన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.