Mukul Roy: రేపు టీఎంసీలో కూడా ఉండలేనంటాడేమో.... ముకుల్ రాయ్ పై బీజేపీ విమర్శలు

  • బీజేపీని వీడిన ముకుల్ రాయ్
  • మమత సమక్షంలో సొంతగూటికి చేరిన వైనం
  • దురదృష్టకరమన్న సాయంతన్ బసు
  • ఆయన వెంట ఒక్క బీజేపీ కార్యకర్త కూడా లేరని వెల్లడి
BJP criticizes on Mukul Roy who left part and joined TMC

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ ఇవాళ టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీలో ఎవరూ ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయని టీఎంసీలో చేరిన సందర్భంగా ముకుల్ రాయ్ వ్యాఖ్యానించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు స్పందించారు.

"ముకుల్ రాయ్ కి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చింది. ఆయన ఆ పదవిని తిరస్కరించలేదు. ఈ ఎన్నికల్లో కృష్ణానగర్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇచ్చింది... అప్పుడూ ఆయన తిరస్కరించలేదు. ఇప్పుడు పార్టీలో పరిస్థితి బాగాలేదంటూ వెళ్లిపోయారు. ఏమో... రేపు టీఎంసీలో కూడా పరిస్థితులు ఏం బాగాలేవని ఆయన అనొచ్చు" అని వ్యాఖ్యానించారు.

ముకుల్ రాయ్ బీజేపీని వీడడం దురదృష్టకరమని బసు పేర్కొన్నారు. గతంలో ముకుల్ రాయ్ కంటే పెద్ద నేతలు కూడా బీజేపీని వీడారని, ఇవాళ ముకుల్ రాయ్ వెంట ఒక్క బీజేపీ కార్యకర్త కూడా టీఎంసీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. ముకుల్ రాయ్ వంటి నేతలు వెళ్లినంత మాత్రాన బీజేపీకి ఎలాంటి నష్టం ఉండదని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News