Sajjala Ramakrishna Reddy: జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఇదే విధంగా ప్రచారం చేస్తున్నారు: సజ్జల

Sajjala Ramakrishna Reddy press meet after CM Jagan Delhi tour concludes
  • ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన 
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం ఢిల్లీ వెళ్లారన్న సజ్జల 
  • విపక్షనేతలది కడుపుమంట అని విమర్శలు
  • చంద్రబాబే చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపణ
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగిందని వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం కలిశారని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రస్తావించారని తెలిపారు. ఈ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్ ఎప్పుడూ తన ఢిల్లీ పర్యటనలపై ఊదరగొట్టింది లేదని, గతంలో చంద్రబాబు ఆ విధంగా డప్పు కొట్టుకునేవారని విమర్శించారు.

జగన్ ఢిల్లీ వెళితే వీళ్లకు ఎందుకు కడుపు మంటో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. అమిత్ షాను కలవడం పైనా రాద్ధాంతం చేస్తున్నారని, మీడియాలోనూ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని సజ్జల అసంతృప్తి వ్యక్తం చేశారు. అమిత్ షా అపాయింట్ దొరకలేదని, విశ్వసనీయ సమాచారం అని ఓ చానల్ పేర్కొందని, ఓ సీఎంకు అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకడం ఏమైనా బ్రహ్మాండమైన విషయమా? అని ప్రశ్నించారు. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా కేసులు మాఫీ చేయించుకునేందుకేనని ప్రచారం చేస్తున్నారని, అదే నిజమైతే ఇప్పటివరకు ఆయనపై ఎందుకు కేసులు కొట్టివేయలేదని నిలదీశారు.

నాడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఎలా సాగాయో అందరికీ తెలుసని, చంద్రబాబు చీకట్లో ఒప్పందాలు కుదుర్చుకునేవారని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు పర్యటనలు సాగేవని విమర్శించారు. ఏమీ లేని ఆకులు ఎగిరెగిరి పడుతుంటాయని, విమర్శలను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు.
Sajjala Ramakrishna Reddy
Jagan
Delhi
Chandrababu
Andhra Pradesh

More Telugu News