కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి: తరుణ్ చుగ్

11-06-2021 Fri 16:47
  • ఈటల బీజేపీలోకి వస్తున్నారంటే కేసీఆర్ ఓడిపోయినట్టే
  • టీఆర్ఎస్ లో ఈటల సంఘర్షణ అనుభవించారు
  • కేసీఆర్ కు ఆయన కుటుంబమే ముఖ్యం
Telangana should be free from KCR says Tarun Chug

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తెలంగాణలో యుద్ధం నడుస్తోందని... అది అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య నడుస్తున్న యుద్ధమని చెప్పారు. ఈటల రాజేందర్ వంటి ప్రజానేత బీజేపీలోకి వస్తున్నారంటే... అది కేసీఆర్ ఓడిపోవడమేనని అన్నారు.

తెలంగాణలో ఒక వ్యక్తి, ఆయన కుటుంబం అరాచకాలకు పాల్పడుతోందని... ఆ అరాచకాల మీదే ఈటల తన గొంతును వినిపించారని తరుణ్ చుగ్ చెప్పారు. తనను నమ్ముకున్న వారి కోసం ఈటల ఎంతో చేశారని అన్నారు. ఎన్నో రోజులుగా టీఆర్ఎస్ లో సంఘర్షణను అనుభవించారని చెప్పారు. కేసీఆర్ కు ఆయన కుటుంబమే ముఖ్యమని విమర్శించారు.

కేసీఆర్ పై ఈటల చేస్తున్న పోరాటానికి బీజేపీ మద్దతు పలుకుతుందని చెప్పారు. బీజేపీ అయినా, ఈటల అయినా తమందరి ఉద్దేశం ఒకటేనని... కేసీఆర్ రాచరికం, అహంకారం నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ఎవరితోనైనా కలిసి ముందుకు సాగుతుందని చెప్పారు.