DSC-2008: 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఏపీ సర్కారు శుభవార్త

  • ఎస్జీటీలుగా అవకాశం
  • మినిమమ్ టైమ్ స్కేల్ ప్రాతిపదికన ఉద్యోగాలు
  • 2,193 మందికి అవకాశాలు
  • సీఎం జగన్ మానవత్వం చూపారన్న మంత్రి ఆదిమూలపు
AP Govt decides to take DSC qualified candidates as SGTs

సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్య పట్ల ఏపీ సర్కారు సానుకూల ధోరణితో స్పందించింది. వీరిలో అంగీకారం తెలిపిన వారిని మినిమమ్ టైమ్ స్కేల్ ప్రాతిపదికలో ఎస్జీటీలుగా తీసుకునేందుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.

నాడు వైఎస్సార్ హయాంలో 50 వేల పైచిలుకు పోస్టుల కోసం మెగా డీఎస్సీ నిర్వహించగా, అర్హతల మార్పు కారణంగా నియామకాల్లో కొందరు అవకాశాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన విషయం గత కొన్నేళ్లుగా కోర్టుల్లోనూ, ట్రైబ్యునల్ లోనూ నలుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు.

దీనిపై తాము చాలా లోతుగా అధ్యయనం చేశామని తెలిపారు. సీఎం జగన్ స్వయానా అధికారులను పిలిపించుకుని డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారని తెలిపారు. నాడు నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య 4,657 అని, వారి వివరాలను సేకరించామని వెల్లడించారు. ఇప్పుడు వారిలో మినిమమ్ టైమ్ స్కేల్ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి 2,193 మంది ముందుకు వచ్చారని వెల్లడించారు. వీరి అంశాన్ని సీఎం జగన్ మానవతా దృక్పథంతో పరిశీలించి నిర్ణయం తీసుకున్నారని, 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన అనంతరం వారు ఎస్జీటీలుగా అవకాశం అందుకోబోతున్నారని మంత్రి సురేశ్ వివరించారు.

More Telugu News