బెయిల్ రద్దవుతుందన్న భయంతోనే జగన్ ఢిల్లీ పర్యటన: యనమల

11-06-2021 Fri 15:42
  • ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
  • విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ నేత యనమల
  • సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారని ఆరోపణ
  • లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యలు
Yanamala comments on CM Jagan Delhi tour

సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఢిల్లీ వెళ్లింది సొంత ప్రయోజనాల కోసమే తప్ప, రాష్ట్రాభివృద్ధి కోసం కాదని ఆరోపించారు. బెయిల్ రద్దు చేసి జైలుకు పంపుతారేమోనన్న భయంతోనే జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలను కలిశారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీలో పర్యటించినట్టయితే, పర్యటనకు సంబంధించిన వివరాలను ఎందుకు ప్రజలకు వెల్లడించలేదని యనమల నిలదీశారు.

జగన్ పర్యటన కేసుల మాఫీ కోసం తప్ప మరొకందుకు కాదని, ఒకవేళ రాష్ట్రం కోసమే ఢిల్లీ వెళితే ఆయన పర్యటన ద్వారా ఏం ఒరిగిందో చెప్పాలని స్పష్టం చేశారు. ప్రత్యేక విమానాల్లో తరచుగా ఢిల్లీ వెళుతున్న సీఎం జగన్ తన పర్యటన వివరాలను, తాను కేంద్రం పెద్దలకు అందించే విజ్ఞాపన పత్రాలను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రతిసారీ మీడియా ముందుకు రాకపోవడం చూస్తుంటే, లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్న విషయం వెల్లడవుతోందని యనమల ఆరోపించారు.