వలస వచ్చిన ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటిస్తే.. భూకబ్జాలను ఆపొచ్చు: అసోం సీఎం

11-06-2021 Fri 14:52
  • సామాజిక సమస్యలకు అధిక జనాభానే కారణమని కామెంట్
  • జనాభా పెరిగితే తన ఇల్లూ కబ్జా అవుతుందన్న సీఎం
  • దీనిపై ముస్లిం పార్టీలతో చర్చలకు సిద్ధమని వెల్లడి
Adopt Decent Family Planning Assam Chief Minister To Immigrant Muslims

భూకబ్జాల వంటి సామాజిక రుగ్మతలకు అధిక జనాభానే కారణమని అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ అన్నారు. వలస వచ్చిన ముస్లింలు కుటుంబ నియంత్రణను పాటించి, జనాభాను కట్టడి చేస్తే వాటిని నివారించొచ్చని చెప్పారు. జనాభా ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్లకే కామాఖ్య ఆలయాన్ని, తన ఇంటినీ కబ్జా చేసేస్తారని అన్నారు.

ఇప్పటికే జనాభా నియంత్రణ చట్టాన్ని తెచ్చామని, కానీ, ముస్లిం మైనారిటీలూ జనాభాను తగ్గించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. పేదరికం, భూ కబ్జాలకు కారణం జనాభా విస్ఫోటమేనన్నారు. వైష్ణవాలయాలు, సత్రాలు, అటవీ భూముల ఆక్రమణను సహించబోమన్నారు. వలసవచ్చిన ముస్లింలు అర్థం చేసుకుని జనాభాను తగ్గించుకోవాలన్నారు. దీనిపై ఏఐయూడీఎఫ్ నేత బద్రుద్దీన్ అజ్మల్, ఆల్ అసోం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ తోనూ మాట్లాడతానన్నారు.