BJP: విరాళాల్లో ఏడోసారీ ‘టాప్’ లేపిన బీజేపీ.. రూ. 785.77 కోట్లతో మరోమారు అగ్రస్థానం

  • రూ. 139 కోట్ల విరాళాలతో బీజేపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్
  • టీఆర్ఎస్‌కు రూ. 89 కోట్లకు పైగా విరాళాలు
  • వైసీపీకి రూ. 8.92 కోట్లు, టీడీపీకి రూ. 2.60 కోట్ల విరాళాలు
  • వెల్లడించిన ఎన్నికల కమిషన్
BJP received Rs 785 crore in donations in 2019 and 20

విరాళాల సేకరణలో భారతీయ జనతాపార్టీ మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. 2019-20లో ఆయా పార్టీలకు విరాళాల ద్వారా సమకూరిన మొత్తానికి సంబంధించిన వివరాలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ రూ.785.77 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, కాంగ్రెస్‌కు రూ. 139 కోట్లు, ఎన్సీపీకి రూ. 59 కోట్లు, సీపీఎంకు రూ. 19.6 కోట్లు, టీఎంసీకి రూ. 8 కోట్లు, సీపీఐకి రూ. 1.9 కోట్లు విరాళాల ద్వారా సమకూరాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, గులాబీ పార్టీ టీఆర్ఎస్‌కు రూ. 89,55,21,348 విరాళంగా రాగా, వైసీపీకి రూ. 8,92,45,126, టీడీపీకి రూ. 2,60,64,011, ఎంఐఎంకు రూ. 13,85,000 విరాళాల రూపంలో సమకూరాయి. టీఆర్ఎస్‌కు 41 మంది రూ. 20 వేలకు పైగా విరాళంగా అందించారు. మంత్రి కేటీఆర్, కూర్మయ్యగారి నవీన్ అత్యధికంగా రూ. 2.50 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు.

తమిళనాడుకు చెందిన జేఎస్ఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ వైసీపీకి అత్యధికంగా రూ. 2.50 కోట్లను విరాళంగా ఇచ్చింది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.శివకుమార్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారు.

చెన్నైకి చెందిన ట్రింప్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ టీడీపీకి అత్యధికంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. అలాగే, వివిధ సంస్థల నుంచి ఆయా పార్టీలకు లక్షల రూపాయలు విరాళాల రూపంలో సమకూరాయి.

More Telugu News