ఐదుగురు కుమార్తెలతో కలిసి రైలుకింద పడి మహిళ ఆత్మహత్య

11-06-2021 Fri 07:59
  • చత్తీస్‌గఢ్‌లో ఘటన
  • భర్తతో గొడవపడి పిల్లలతో కలిసి ఆత్మహత్య
  • పట్టాలపై చెల్లాచెదురుగా మృతదేహాలు
Chhattisgarh woman jumps infront of train with 5 kids

కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఐదుగురు కుమార్తెలతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. చత్తీస్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మహాసముంద్ జిల్లా బెమ్చా గ్రామానికి చెందిన ఉమా సాహు (45)-రామ్ సాహు భార్యాభర్తలు. వీరికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా 18-10 ఏళ్లలోపు వారే. బుధవారం భర్తతో ఉమకు గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పిల్లలను తీసుకుని అదే రోజు రాత్రి గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న బేల్ సొండా రైల్వే జంక్షన్‌‌కు వెళ్లింది.

వేగంగా వస్తున్న రైలు కిందకు పిల్లలతో కలిసి దూకింది. ఈ ఘటనలో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను నిన్న ఉదయం గమనించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ విచారణకు ఆదేశించారు.