Corona Virus: కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోసు సరిపోతుందట!

Covid vaccine one dose enough for who recoverd from covid
  • ఒక్క డోసుతోనే మూడు రెట్లు పెరిగిన యాంటీబాడీలు
  • ఏఐజీ అధ్యయనంలో వెల్లడి
  • రెండో డోసు వేయించుకోవాల్సిన పనిలేదన్న డాక్టర్ నాగేశ్వరరెడ్డి
  • సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాలు
కరోనా బారినపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ ఒక్క డోసే గొప్పగా పనిచేస్తుందని హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) వైద్య నిపుణుడు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత నెల రోజులకు టీకా వేయించుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు.

ఈ మేరకు పలువురు నిపుణులతో కలిసి నిర్వహించిన పరిశోధన పత్రం మెడికల్ జర్నల్ ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్’లో ప్రచురితమైంది. దీని ప్రకారం.. వైరస్ బారినపడి కోలుకున్న నెల రోజుల తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో యాంటీబాడీలు మూడింతలు అభివృద్ధి చెందినట్టు గుర్తించారు. వైరస్ సోకని వ్యక్తులు ఒక డోసు టీకా తీసుకున్నప్పటికీ యాంటీ బాడీల వృద్ధి సాధారణంగానే ఉందని అధ్యయనంలో వెల్లడైంది.

ఈ పరిశోధన కోసం కొవిడ్ బారినపడి కోలుకున్న 131 మందిని ఎంచుకున్నారు. ఇందులో 79 మంది పురుషులు కాగా, 52 మంది మహిళలు ఉన్నారు. పురుషుల వయసు 20-58 ఏళ్ల మధ్య ఉండగా, మహిళలు 19-58 ఏళ్ల మధ్యవారు. అలాగే, కొవిడ్ బారినపడని మరో 149 మందిపైనా పరిశోధన చేశారు. వీరిలో 98 మంది పురుషులు కాగా, 51 మంది మహిళలు ఉన్నారు. వీరు కూడా ఇంచుమించు పైన చెప్పుకున్న వయసు గ్రూపు వారే. రెండు గ్రూపుల్లోని వ్యక్తులకు టీకాలు ఇచ్చిన తర్వాత జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఎదురయ్యాయి.

సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఒక్క డోసు తీసుకున్న ఫలితం గణనీయంగా కనిపించింది. నిజానికి యాంటీబాడీల వాల్యూ 150 దాటితే రక్షణ ఉంటుందని అర్థం. కొవిడ్ సోకి తగ్గిన తర్వాత ఒక డోసు టీకా పొందిన వారిలో ఇది మూడు రెట్లు అధికంగా అంటే 450 కంటే ఎక్కువగానే ఈ వాల్యూ ఉన్నట్టు గుర్తించారు. కొవిడ్ సోకని వ్యక్తుల్లో ఇది 150 వరకు పెరిగింది. కొవిడ్ బారినపడి తగ్గిన వారు ఒక డోసు టీకా తీసుకుంటే యాంటీ బాడీలు చాలా కాలం పాటు కొనసాగుతాయని నిపుణులు పేర్కొన్నారు.

కొవిడ్ బారినపడి కోలుకున్న వారికి ఒక డోసు టీకా సరిపోతుందని, వారు రెండో డోసు వేయించుకోవాల్సిన పనిలేదని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. కాబట్టి మిగిలిన డోసును మరొకరికి ఉపయోగించవచ్చన్నారు. వారిలో ఏడాది పాటు యాంటీ బాడీలు క్రియాశీలంగా ఉంటాయని, కాబట్టి  ఆ తర్వాత బూస్టర్ డోసు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. తమ అధ్యయన వివరాలను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి పంపినట్టు తెలిపారు.
Corona Virus
Vaccine
Hyderabad
AIG
Dr Nageswar Reddy

More Telugu News