నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన కానిస్టేబుల్ పై దాడి... వీడియో ఇదిగో!

10-06-2021 Thu 19:33
  • పటాన్ చెరులో ఘటన
  • ఇంటిని నిర్మించుకున్న మారుతీప్రసాద్ అనే ఐటీ నిపుణుడు
  • ఇంటీరియర్ డిజైన్ల కోసం దేవీలాల్ తో కాంట్రాక్టు
  • అడ్వాన్సు తీసుకుని పని ఎగవేసిన దేవీలాల్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మారుతీప్రసాద్
Attack on a constable in Patancheru

ఓ కేసు విషయంలో నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసు కానిస్టేబుల్ పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చోటుచేసుకుంది. బాచుపల్లికి చెందిన మారుతీప్రసాద్ అనే ఐటీ ఇంజినీరు ఓ ఇంటిని నిర్మించుకుని, ఇంటీరియర్ డిజైనింగ్ నిమిత్తం దేవీలాల్ అనే వ్యక్తికి కొంత మొత్తం అడ్వాన్సుగా ఇచ్చాడు. అయితే, అడ్వాన్సు తీసుకున్న దేవీలాల్ ఇంటి పని పూర్తిచేయకుండా ఎగవేతకు పాల్పడుతుండడంతో మారుతీప్రసాద్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ద్వారా బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే పోలీసులకు దేవీలాల్ అసలైన చిరునామా లభ్యంకాలేదు. దాంతో వారికి సాయపడేందుకు ఫిర్యాదుదారుడు మారుతీప్రసాద్ ముందుకొచ్చాడు. ఈ క్రమంలో మారుతీప్రసాద్ సాయంతో దేవీలాల్ కు నోటీసులు ఇచ్చేందుకు కానిస్టేబుల్ కనకయ్య ప్రయత్నించాడు. కానీ, దేవీలాల్, అతని అనుచరులు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ కనకయ్యపై దాడికి పాల్పడ్డారు.

వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడిన కానిస్టేబుల్ కనకయ్య... పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దేవీలాల్ తో పాటు అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ పై దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.