ప్రకాశ్ జవదేకర్, షెకావత్ లతో సీఎం జగన్ సమావేశం

10-06-2021 Thu 17:02
  • ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన
  • మొదట ప్రకాశ్ జవదేకర్ తో భేటీ
  • ఆపై షెకావత్ ను కలిసిన వైనం
  • కాసేట్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో సమావేశం
CM Jagan met Prakash Jawadekar and Gajendra Singh Shekawat

ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన ప్రారంభమైంది. ఆయన మొదట కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తోనూ, ఆపై జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులపై ప్రకాశ్ జవదేకర్ తో చర్చించారు. పోలవరం పీపీఏతో పాటు కేంద్ర జలమండలి సిఫారసులకు ఆమోదం తెలపాలని షెకావత్ తో భేటీ సందర్భంగా కోరారు. ముఖ్యంగా, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి సమ్మతించిన విధంగా 2017-18 ధరల సూచీ ప్రకారం రూ.55,656.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని షెకావత్ కు విజ్ఞప్తి చేశారు.

 సీఎం జగన్ కాసేపట్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ను కలవనున్నారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం జగన్ వెంట ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలశౌరి, సత్యనారాయణ, భరత్, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, గురుమూర్తి తదితరులు ఉన్నారు. కాగా,  సీఎం జగన్  ఈ రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.