ఢిల్లీలో సీఎం జగన్ కు స్వాగతం పలికిన విజయసాయి, మోపిదేవి

10-06-2021 Thu 15:15
  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్
  • రెండ్రోజుల పాటు పర్యటన
  • సీఎం వెంట ఎంపీలు, సజ్జల
  • నేడు, రేపు కేంద్రమంత్రులతో జగన్ భేటీలు
Delhi CM Jagan arrives Delhi for two day tour

రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.  ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ స్వాగతం పలికారు. సీఎం జగన్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ తదితరులను కలవనున్నారు. పోలవరం సహా పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి చెందిన అనేక కార్యక్రమాలపై కేంద్రం సహకారాన్ని కోరనున్నారు. సీఎం జగన్ రేపు మధ్యాహ్నం తర్వాత ఏపీకి చేరుకుంటారు.

కాగా, ఢిల్లీకి సీఎం వెంట వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలశౌరి కూడా ఉన్నారు. సీఎం జగన్ తన పర్యటనలో భాగంగా మొదట గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు. పోలవరం నిధులు, పెండింగ్ అంశాలను ఆయనతో చర్చించనున్నారు. ఆపై విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రధాన అజెండాగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం అవుతారు.  

ఇక రాత్రి 9 గంటలకు అమిత్ షాతో కీలక భేటీ జరగనుంది. రాష్ట్రానికి చెందిన అంశాలను అమిత్ షాతో సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. రేపు ఉదయం చివరగా రైల్వే మంత్రి పియూష్ గోయల్ తో సమావేశమై, రాష్ట్రానికి తిరిగి రానున్నారు.