బాలకృష్ణ సర్... మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి: క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్

10-06-2021 Thu 14:57
  • నేడు బాలయ్య పుట్టినరోజు
  • శుభాకాంక్షల వెల్లువ
  • ట్విట్టర్ లో స్పందించిన యువీ
  • నిత్యస్ఫూర్తి ప్రదాత అంటూ కితాబు
Team India former cricketer Yuvraj Singh wishes Nandamuri Balakrishna on his birthday

నందమూరి బాలకృష్ణ నటుడు, రాజకీయవేత్త మాత్రమే కాదు.... బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలమంది క్యాన్సర్ రోగులకు ఊరట కలిగిస్తున్న మానవతావాది కూడా. ఇదే అంశాన్ని భారత క్రికెట్ మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రస్తావించారు.

ఇవాళ బాలకృష్ణ పుట్టినరోజు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యువీ కూడా బాలయ్యకు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'బాలకృష్ణ సర్, మీ వినోదాత్మక ప్రదర్శనలు, మానవతా దృక్పథంతో కూడిన మీ కార్యక్రమాలతో ఈ ప్రపంచానికి నిత్యస్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆశిస్తున్నాను' అంటూ యువీ ఆకాంక్షించారు. అంతేకాదు, గతంలో తాను బాలయ్యతో కలిసి ఉన్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.

యువీ గతంలో క్యాన్సర్ బాధితుడన్న సంగతి తెలిసిందే. 2011 వరల్డ్ కప్ తర్వాత ఈ డాషింగ్ ఆల్ రౌండర్ క్యాన్సర్ బారినపడ్డాడు. అయితే మొక్కవోని పట్టుదలతో క్యాన్సర్ ను జయించిన యువీ కూడా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా క్యాన్సర్ రోగులకు బాలకృష్ణ అందిస్తున్న సేవలు యువరాజ్ సింగ్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.