కృష్ణా కరకట్ట వద్ద డ్రెడ్జింగ్ పనులపై స్థానికుల మండిపాటు.. దేవినేని ఉమ‌ పరిశీలన

10-06-2021 Thu 11:50
  • గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, తాళ్లాయ పాలెం సమీపంలో ఘ‌ట‌న‌
  • కరకట్ట వద్ద డంప్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ స్థానికుల ఆందోళ‌న‌
  • గ్రామాలు వరద ముంపుకు గురయ్యే ప్రమాదముందని ఆరోపణ  
devineni uma reaches thallaya palem

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, తాళ్లాయపాలెం సమీపంలో కరకట్ట వద్ద కృష్ణా నది నుంచి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను డంప్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ స్థానికులు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తోన్న నేప‌థ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఆ ప్రాంతానికి వెళ్లారు. నిన్న జేపీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్వాహకులు ఇసుక‌ను డంప్ చేసేందుకు ప్రయత్నాలు చేశారని ఆయ‌నకు స్థానికులు చెప్పారు.

కరకట్ట పక్కన డంపింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే కరకట్ట బలహీనపడుతుందని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీంతో గ్రామాలు వరద ముంపుకు గురయ్యే ప్రమాదముందని తెలిపారు. కృష్ణా నది ఒడ్డు నుంచి 500 మీటర్ల లోపల నీటిలోకి వెళ్లి  డ్రెడ్జింగ్ చేపడితే బాగుంటుంద‌ని వారు అన్నారు.  

కాంట్రాక్టర్ మాత్రం ఇష్టానుసారంగా డ్రెడ్జింగ్ పనులు చేస్తుండ‌డంతో త‌మకు ముప్పు వాటిల్లుతుంద‌ని చెప్పారు. నిన్న ఇసుకను డంప్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సిబ్బందిని అడ్డుకున్నామ‌ని తెలిపారు. రైతులను పరామర్శించిన దేవినేని ఉమ అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్నారు.